కృష్ణా జిల్లా, గన్నవరం పంచాయతీలో ఎలక్ర్టికల్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుడు విద్యుత్ స్తంభం పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం గన్నవరం గౌడ బజార్‌లో జరిగింది. గౌడబజార్‌లో వీధి లైట్లు వెలగటం లేదని ఫిర్యాదు రాడంతో కార్మికుడు గోగం శ్రీనివాసరావు లైట్లు వేసేందుకు అక్కడకు వెళ్లాడు. విద్యుత్ స్తంభానికి నిచ్చెన వేసి, దానిపై నుంచి లైట్లు వేస్తుండగా నిచ్చెన జరిగింది. శ్రీనివాసరావు విద్యుత్ వైర్లను పట్టుకోవటంతో షాక్ కొట్టింది. అక్కడ నుంచి కింద పడిపోయాడు. స్థానికులు చూసి పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీనివాసరావును కుటుంబసభ్యులు విజయవాడ తీసుకువెళ్లినట్లు కార్యదర్శి చెన్నకేశవరావు తెలిపారు. శ్రీనివాసరావు గాయపడడానికి పంచాయతీ అధికారులే కారణమని ఎంపీటీసీ సభ్యుడు పడమట రంగారావు ఆరోపించారు. వీధిలైట్లు వేసేటప్పుడు మరొకరు లేకుండా ఎందుకు పంపించారని ఆయన ప్రశ్నించారు.