మోడీ ప్రభుత్వ పాలనలో అదానీలకు హల్వాలు, పేద ప్రజలకు పకోడీలు అని కాంగ్రెస్ నాయకులు జై రాం రమేష్ విమర్శించారు. భారత్లో వేతన అసమానతలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు.నివేదిక ప్రకారం దేశంలో టాప్ 10 శాతంలో ఉన్న ఆదాయాన్ని సంపాదించే వారు దిగువున ఉన్న 10 శాతం కంటే 6.8 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని జైరాం రమేష్ తెలిపారు. 'దేశంలో వేతన అసమానత పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్లతో సహా మన పొరుగు దేశాలు కంటే తీవ్రంగా ఉంది' అని ఎక్స్లో జైరాం రమేష్ పోస్టు చేశారు. 'ఇది మన నాన్-బయోలాజికల్ ప్రధాని సృష్టించిన పకోడా-నామిక్స్ యొక్క ప్రత్యక్ష పరిణామమని గుర్తుంచుకోండి. ఎక్కువ మందికి పకోడీలు, ఎంపిక చేసుకున్న కొద్ది మందికి హల్వాలు' అని జైరాం రమేష్ విమర్శించారు.