ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ అడ్డంకి ఓ మెట్టు.. అమెరికాలో కేసుపై తొలిసారి గౌతమ్ అదానీ స్పందన

national |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 09:56 PM

దేశంలో మరోసారి అదానీ అంశం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అదానీ గురించే చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అదానీ కంపెనీపై నమోదైన కేసు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ కాంట్రాక్టుల కోసం.. గౌతమ్ అదానీ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారన్న అభియోగాలపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అది బయటికి రావడంతో భారత్‌లో పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై గౌతమ్ అదానీ స్పందించారు.


శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన 51వ జెమ్‌ అండ్‌ జ్యుయెలరీ అవార్డ్స్‌ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ అదానీ.. అదానీ కంపెనీలపై, తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. అదానీ గ్రూప్‎పై అమెరికా చేసిన ఆరోపణలు తమకు కొత్త కాదని.. ఇలాంటి తరహా ఆరోపణలు తమ కంపెనీలు గతంలో కూడా చాలా ఎదుర్కొన్నాయని తెలిపారు. కానీ ఇలాంటి ప్రతీ దాడి అదానీ కంపెనీలను మరింత బలపరుస్తుందని వెల్లడించారు. ప్రతి అవరోధం అదానీ గ్రూప్ మరింత దృఢం అయ్యేందుకు ఒక అవకాశం అవుతుందని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. ఎదుర్కొన్న సవాళ్లు మరింత పెద్దవని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు, సవాళ్లు అదానీ గ్రూపును విచ్ఛిన్నం చేయలేదని.. అవి మరింత కఠినతరం చేశాయని తేల్చి చెప్పారు. ప్రతీ పతనం తర్వాత మనం మళ్లీ పైకి లేస్తామనే అచంచలమైన నమ్మకాన్ని అందించాయని గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు.


ఇక అదానీ గ్రూప్‎పై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఎవరూ ఎఫ్‌సీపీఏ ఉల్లంఘన లేదా న్యాయాన్ని అడ్డుకునే కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రపంచంలో వాస్తవాల కంటే అబద్ధాలే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గతంలో వచ్చిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలను కూడా గౌతమ్ అదానీ గుర్తు చేశారు. అమెరికా ఆరోపణల తరహాలోనే గతంలో తమపై హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిందని తెలిపారు. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని తేలిందని స్పష్టం చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ తీవ్రంగా ఇబ్బందిపడ్డప్పటికీ.. అంతే వేగంగా తిరిగి పుంజుకుందని గుర్తు చేశారు. అంతేకాకుండా అదానీ గ్రూప్ ఆల్ టైమ్ రికార్డ్ ఆర్థిక ఫలితాలు తమ నిబద్ధతను చూపించాయని పేర్కొన్నారు. చివరికి అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని గౌతమ్ అదానీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com