విశాఖనగరంలోని ఆర్‌కే బీచ్ రోడ్డులో వీఎంఆర్‌డీఏ సిద్ధం చేస్తున్న యుహెచ్-3హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని జనవరి 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభించనున్నట్టు తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు. నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన ఇష్టాగోష్ఠిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతి ఏటా నేవీ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌లో సాహస విన్యాసాలు (ఆపరేషన్ డెమో) ప్రదర్శించేవారమని, ఈసారి ఈ కార్యక్రమం పూరీలో ఏర్పాటుచేశామన్నారు. విశాఖ ప్రజలకు అసంతృప్తి లేకుండా జనవరి 4న ఆపరేషన్ డెమో నిర్వహిస్తామని చెప్పారు. దీనికి కూడా సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తారన్నారు.