విజయనగరం జిల్లాలో సమారు రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులనే చేపట్టామని మంత్రి సృష్టం చేశారు. జిల్లాలో చేపడుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రహదారులు, కాలువలు, గోకులాల నిర్మాణం తదితర పనుల ప్రగతిని కలెక్టర్ అంబేడ్కర్ మంత్రికి వివరించారు. పల్లె పండగలో భాగంగా ఇప్పటి వరకూ రూ.200 కోట్ల విలువైన 2165 పనులను మంంజూరు చేయగా, వీటిల్లో ఇప్పటివరకూ 184 పనులు పూర్తి అయ్యాయని, ప్రగతిలో ఉన్న పనులను జనవరి మొదటి వారంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెండు దశల్లో 1091 గోకులాలను మంజూరు చేశామని, 820 పనులు ప్రారంభం అయ్యాయని, వీటి నిర్మాణం కూడా వారం రోజల్లో పూర్తవ్వాలన్నారు.
చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రెండు రోజుల్లో తీర్మానాలను పూర్తి చేసి తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని చెప్పారు. నియోజకవర్గానికి రూ.10 కోట్లతో పెద్ద ఎత్తున తారురోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.