తుపాను కారణంగా చేతికి వచ్చిన ధాన్యం తడిచిపోయి, కొనుగోలు చేసే వారు లేక రైతాంగం అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాశాఖ మంత్రి నాందెండ్ల మనోహర్ లు డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారని మాజీమంత్రి, వైయస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
విశాఖపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుపాను హెచ్చరికలు వచ్చిన తరువాత అయినా సరే సీఎం చంద్రబాబు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళపై కనీసం ఒక్క సమీక్షా సమావేశం అయినా నిర్వహించారా అని నిలదీశారు. పీడీఎస్ బియ్యం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ లు కాకినాడ పోర్ట్ చుట్టూ తిరగడమే సరిపోతోంది. రైతుల ఇబ్బందులను మరిచి డైవర్షన్ రాజకీయాలకే వీరు పరిమితం అయ్యారని విమర్శించారు.