రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య మరింత చేరువ కానుందని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానంగా నూతనంగా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసే దిశగా, కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో 8, తెలంగాణలో 7 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 85 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించగా, ఒక్కొక్క విద్యాలయంలో 960 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలస పల్లె గ్రామం, శ్రీ సత్య సాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లి, కృష్ణాజిల్లా నందిగామ, గుంటూరు జిల్లా రొంపిచర్ల, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు కానున్నాయి. ఇక తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలలో ఈ విద్యాలయాలను కేటాయించారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేంద్రీయ విద్య మరింత చేరువైందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు చోట్ల కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, ఎందరో విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో మరికొంత మంది విద్యార్థులకు కేంద్రీయ విద్య చేరువ కానున్నట్లు చెప్పవచ్చు. కేంద్రీయ విద్యాలయం సీటు రావడం ప్రతి విద్యార్థి తన లక్ష్యంగా ఎంచుకుంటారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష రాసి, ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ విద్యాలయంలో ఒక్కసారి సీటు వచ్చిందా.. ఇంటర్ విద్య పూర్తి వరకు అక్కడే విద్య కొనసాగిస్తారు. అంతా ఉచిత వసతి, విద్య ఇక్కడ విద్యార్థులకు అందుతుంది. అందుకే తాజాగా కేంద్రం చేసిన ప్రకటన ఆయా జిల్లాల విద్యార్థులకు గొప్ప వరంగా చెప్పవచ్చు.