ఇటీవల ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో ఐదు నుంచి ఏడు రోజులపాటు వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీ, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, అన్నదాతలు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో నేడు దక్షిణ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడిందని అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12 నాటికి శ్రీలంక- తమిళనాడు తీరాల వద్ద మరింత బలపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశ, తూర్పు దిశగా గాలులు వీచనున్నాయి.
అల్పపీడనంతో ఏపీలో వర్షాలు ఫెంగల్ తుపాను తరువాత ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. తాజా అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకాశం ఇప్పటికే మేఘావృతమై ఉండగా కొన్నిచోట్ల వర్షం కురుస్తోంది. నేడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు రోజులపాటు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.