చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. చంద్రబాబును విమర్శించినా... తమకు, పవన్ కల్యాణ్ కు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా విజయసాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు.తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని విజయసాయి ధైర్యంగా చెప్పాలని అనిత అన్నారు. ఆయనపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమాలపై కూడా విచారణ జరుగుతోందని... నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని అన్నారు. విజయవాడలోని సబ్ జైలును ఈరోజు అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జైల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. జైల్లో మౌలిక వసతులపై ఆరా తీయడం జరిగిందని తెలిపారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.