ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో అనేక విషయాలను ఉండవల్లి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ జరపకుండా తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి మరీ చేశారన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ విషయంలో తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీసం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 74542 కోట్లు బకాయిలు రావాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత 2018లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ విషయమై చర్చించానని.. దీనిపై లోక్ సభలో చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుఫున అఫిడవిట్ దాఖలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు. కానీ అవి ఇప్పటికీ అమలు కాలేదని ఉండవల్లి విమర్శించారు.
2019లో విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మనకు జరిగిన అన్యాయంమై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని తీర్మానించామని.. కానీ నాటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుఫున అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తాను లేఖ రాశానని కానీ తనకు ఎలాంటి సమాధానం రాలేదని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ .. తాను వేసిన పిటిషన్‌పై విచారణను మూసివేయాలని కోరినట్లు ఉండవల్లి గుర్తుచేశారు.
2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో జరిగిన ఘటనలపై, ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, వైసీపీ సభ్యులు చర్చకు నోటీసులు ఇవ్వడం లేదన్న ఉండవల్లి.. ఎక్కడైతే మన నోరు నొక్కి సభా నిబంధనలను తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారో... అక్కడే మనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలని కోరారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమిలో ఉండటంతో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయమని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని, పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసు లిప్పించాలనీ, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్‌ను కోరారు.