ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావులు.. అలాగే బీజేపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.అయితే గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఓటర్ కూటమికి పట్టం కట్టాడు.దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో వైసీపీకి పలువురు కీలక నేతలు రాజీనామాలు చేశారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.దాంతో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కొ స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.