నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలోనే జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ముద్రించిందని మంత్రి ఆనం మండిపడ్డారు. నాటి ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 33 రోజులపాటు జరిగే ఈ రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. పొంగూరు, నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి ఆనం రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు.