ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 08:34 PM

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి  అన్నారు. ఎక్స్ వేదికగా షర్మిల స్పందిస్తూ.. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఏపీ రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందనడాని నిదర్శమన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనానికి అద్దం పడుతుందని విమర్శించారు.కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని.. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని.. విభజన చట్టంలోనూ పెట్టిందన్నారు. అనంతరం అధికారంలోకొచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని విమర్శించారు. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. తిరుపతి వేదికగా కడప స్టీల్‌పై ప్రధాన మోదీ హామీ ఇచ్చారని.. ఆ తరువాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారని వ్యాఖ్యలు చేశారు.సీఎం  చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. కడప స్టీల్‌పై మీ వైఖరి ఏంటి? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్‌పై మీ ముసుగు తీయండి సార్. అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించక పోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com