ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభేదాలు ఉన్నా కూటమిగా ఏర్పడ్డామంటే అదే కారణం: పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 04:51 PM

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఏ స్థాయికి వెళ్లాయంటే... అన్ని వ్యవస్థలు మూలాలు కదిలిపోయాయని వివరించారు. వీటిని సరిదిద్దుకోవడానికి, తాము అన్ని విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు కదిలామని పవన్ వివరించారు. "మేం కలిసికట్టుగా కదం తొక్కామంటే అందుకు కారణం... ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు... అనే కారణంతో మేం పొత్తు కుదుర్చుకుని కూటమిగా ఏర్పడ్డాం. నేను పలు శాఖలపై సమీక్ష చేస్తే... ఏదీ కూడా నియయావళి ప్రకారం ఉన్నట్టు కనిపించడంలేదు. చాలా అంశాలు రూల్ బుక్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. అనేక ఆర్థిక అక్రమాలు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేం రాజకీయ నాయకులం ఏది మాట్లాడినా, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయగలిగేది మీరే (కలెక్టర్లు). గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు. ఉన్నతాధికారులతో, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం నుంచి ఇసుక దోపిడీ వరకు అనేక పనులు చేయించింది. కామన్ మేన్ గా బయటి నుంచి చూస్తే మాకు ఎలా అనిపించిందంటే... ఎంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండి కూడా ఎందుకు ఇలాంటి వాటిపై ప్రశ్నించలేకపోయారనిపించింది. ఎంతో కష్టపడి ఐఏఎస్ కు ఎంపికైన మీరు ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని మాకు ఆశ్చర్యం వేసింది. శ్రీలంక, సిరియా వంటి దేశాల్లో ఏం జరిగిందో చూశాం. నిస్సహాయత నుంచి పెల్లుబుకిన ప్రజాగ్రహం ప్రభుత్వ పతనాలకు కారణమైంది. ఇవాళ్టికీ మా ఆపీసు వద్దకు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నేను కాస్త కటువుగా చెప్పేదేంటంటే... ప్రభుత్వ యంత్రాంగాలు సరిగా లేకపోతే ప్రజలు తప్పకుండా తిరగబడతారు. ఇలాంటివి మనం చాలా దేశాల్లో చూశాం. సైబరాబాద్ వంటి సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనొక అవిశ్రాంత శ్రామికుడు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఫ్లైఓవర్లపై వెళుతుంటే... ఒకప్పుడు అక్కడి రాళ్లు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి చంద్రబాబు. మనమెవ్వరం అంతదూరం ఆలోచించలేకపోయాం. మనకు అక్కడ రాళ్లు రప్పలు కనిపించాయే కానీ, చంద్రబాబుకు మాత్రం అక్కడొక మహానగరం కనిపించింది. నాడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లిన విధానం అభినందనీయం. నేను అధికారులను ఈ సందర్భంగా అర్ధిస్తున్నాను... ప్రభుత్వానికి సహకరించండి. మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో మూడు చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా అక్రమాలు ఆగలేదంటే... మేం ఎవర్ని తప్పుబట్టాలో తెలియడంలేదు. ఒకరి వైపు వేలెత్తి చూపడం ఈజీనే. ఇది కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత వహించాల్సిన అంశం. ఈ విషయాన్ని వాళ్లెలా విస్మరిస్తారు? కాకినాడ పోర్టును ఆ విధంగా వదిలేస్తే... కసబ్ వంటి ఉగ్రవాదులు సులభంగా దేశంలో చొరబడరా? నాడు ముంబయిలో ఏం జరిగిందో అందరం చూశాం. ఉదాసీనత కారణంగా.... ఉగ్రవాదుల దాడులతో 300కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇసుక విషయంలో కూడా చంద్రబాబు మొత్తుకుంటున్నారు. ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. మనం అందుకోసమే పనిచేద్దాం.... అందుకోసమే అంకితమవుదాం" అని పవన్ వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com