ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య వేధింపులతో సూసైడ్, టెకీకి నెటిజన్ల సపోర్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 09:18 PM

భార్య వేధింపులు తట్టుకోలేక 40 పేజీల సుదీర్ఘ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక అతుల్ సుభాష్‌.. సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఎన్ని వేధింపులు పెట్టారో అర్థం అవుతోంది. దీంతో నెటిజన్లు అంతా అతుల్ సుభాష్‌కు న్యాయం జరగాలి అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక అతుల్ సుభాష్ కుటుంబ సభ్యులు కూడా.. ఆయన భార్య, ఆమె తరఫు బంధువులు అనేక రకాలుగా మానసికంగా, ఆర్థికంగా అతుల్ సుభాష్‌ను వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు. అయితే అతడి భార్య తరఫు బంధువులు మాత్రం.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.


ఇక సూసైడ్ నోట్‌లో అతుల్ సుభాష్ చేసిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని అతడి భార్య నికితా సింఘానియా బాబాయ్ సుశీల్ సింఘానియా స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అతుల్ సుభాష్ నుంచి విడిపోయిన భార్య నికితా సింఘానియా వద్ద అన్ని సమాధానాలు ఉన్నాయని చెప్పారు. ఇక అతుల్ సుభాష్ మృతి నేపథ్యంలోనే అతడి సోదరుడు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే ఈ కేసులో నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియా, బాబాయ్ సుశీల్ సింఘానియా పేర్లను చేర్చగా.. వారిని విచారణ జరిపేందుకు బెంగళూరు పోలీసులు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు ఒక టీంను పంపించారు.


ఈ నేపథ్యంలోనే అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటనపై 70 ఏళ్ల సుశీల్ సింఘానియా మీడియాతో మాట్లాడారు. తాను మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పిన సుశీల్ సింఘానియా.. గత 3 ఏళ్లుగా విడాకుల కేసు నడుస్తోందని చెప్పారు. అయితే అతుల్ సుభాష్ మృతికి చెందిన ఎఫ్ఐఆర్‌‌లో తమ పేరు ఉందని.. అయితే దానికీ తనకు ఏ సంబంధం లేదని తేల్చి చెప్పారు. తమ కుటుంబం తప్పేమీ లేదని.. అది కోర్టు ఇప్పటికే తీర్పులో వెల్లడించిందని స్పష్టం చేశారు. అతుల్ సుభాష్ చేసిన ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. అంతేకాకుండా ప్రస్తుతం తమ వద్ద నికిత సింఘానియా లేదని.. ఆమె తిరిగి వచ్చిన తర్వాత అన్నింటికి సమాధానం చెబుతుందని తెలిపారు. తాను వేరుగా జీవిస్తున్నానని.. తనకు పెద్దగా సమాచారం లేదని.. ఆ కేసును వాళ్లే చూసుకుంటున్నట్లు చెప్పారు.


 తన భార్య, ఆమె కుటుంబం పెట్టే వేధింపుల తట్టుకోలేక 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్‌ సుభాష్‌.. బెంగళూరులోని మారతహళ్లి మంజునాథ లేఅవుట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా 40 పేజీల సూసైడ్ లేఖ రాసిన అతుల్ సుభాష్.. అందులో తాను పడుతున్న నరకయాతన గురించి వివరించాడు. తనతో గొడవ పడిన భార్య.. పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఆమెతో కలిసి ఉండేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్లు చెప్పాడు.


మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా 2019లో అతుల్ సుభాష్.. యూపీకి చెందిన నికితా సింఘానియాను కలిసి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది తర్వాత ఒక కొడుకు పుట్టగా.. తన భార్య కుటుంబం తననుంచి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు సూసైడ్ లేఖలో అతుల్ తెలిపాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో 2021లో కొడుకుతో కలిసి బెంగళూర్ నుంచి పుట్టింటికి వెళ్లిపోయిన అతుల్ భార్య.. తనపై, తన కుటుంబంపై హత్య, అసహజ సెక్స్‌ సహా చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని తెలిపాడు. ఈ కేసు పరిష్కారం కోసం భార్య, ఆమె కుటుంబం మొదటగా రూ. 1 కోటి.. ఆ తర్వాత రూ. 3 కోట్లు ఇవ్వాలని చెప్పారని పేర్కొన్నాడు. తన భార్య, బిడ్డకు భరణంగా నెలకు రూ. 80 వేలు ఇవ్వాలని కోర్టు కోరగా.. తన భార్య మాత్రం నెలకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పారు. ఇక ఈ కేసులో తనకు కోర్టులపై కూడా విశ్వాసం పోయిందని ఆరోపించాడు.


చనిపోయే ముందు 40 పేజీల సూసైడ్ నోట్ రాసుకున్న అతుల్ సుభాష్.. తాను చేయాల్సిన ప్రతీ పనిని ప్లాన్ చేసుకుని వాటిని పూర్తిచేసి ఉరివేసుకున్నాడు. వీడియో, సూసైడ్ నోట్ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, తన కుటుంబసభ్యులు, ఆఫీస్‌కు మెయిల్ చేశాడు. తలస్నానం చేసి, వంద సార్లు శివనామస్మరణ చేసుకుని ఉరేవేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com