సొంత ఇల్లు అనేది అందరికీ అవసరమే. 60 ఏళ్లు ఆపైన వయసు కలిగిన వారికి సొంత గూడు అనేది మరీ అవసరం. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది రిటైర్మెంట్ వరకు సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. బాధ్యతలన్నీ తీరాక సొంత ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు చేపడుతుంటారు. మరి అలాంటి సీనియర్ సిటిజన్లకు హోమ్ లోన్ తీసుకోవచ్చా? అసలు వారికి బ్యాంకులు గృహ రుణాలు ఇస్తాయా? అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదిలే ఉంటుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు సైతం బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చు. బ్యాంకులు వారి ఆదాయ స్థిరత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తుంటాయి. అయితే, ఉద్యోగం, స్వయం ఉపాధి పొందుతున్న వారితో పోలిస్తే పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు కాస్త ఎక్కువ వడ్డీ వేస్తాయి. సాధారణంగా బ్యాంకులు వీరికి లోన్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తుంటాయి. సరైన ఆదాయ మార్గాలు ఉండవని భావిస్తుంటాయి. అయితే సరైన ప్రణాళిక, ఆర్థిక అవగాహనతో లోన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లు లోన్ తీసుకునేందుకు కొన్ని పాటిస్తే లోన్ పొందవచ్చంటున్నారు.
హోమ్ లోన్ మంజూరు, వడ్డీ రేట్లపై క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అంతే కాదు తక్కువ వడ్డీ రేటుతో లోన్ వేగంగా ఇస్తుంటాయి. మరోవైపు.. LTV లోన్ టూ వాల్యూని ఎంచుకోవడం ద్వారా హోమ్ లోన్ పొందే అవకాశాన్ని పెంచుకోవచ్చు. రూ.50 లక్షల ఇంటి కోసం బ్యాంకు రూ.40 లక్షలు లోన్ ఇస్తే ఎల్‌టీవీ రేషియో 80 శాతంగా ఉంటుంది. అయితే, ఎక్కువ డౌన్ పేమెంట్ చేల్లిస్తే బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకొస్తుంటాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు సైతం తగ్గుతాయి.
ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసే ముందే సీనియర్ సిటిజన్లకు తమ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. నెలవారీ ఆదాయాలు, ఖర్చులు, ఆస్తులు, బాధ్యతలు వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సీనియర్లకు పెన్షన్లు, అద్దె ఆదాయాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వడ్డీలు, డివిడెండ్లు మొదలైన మార్గాల్లో ఆదాయాలు ఉన్నప్పుడు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గు చూపిస్తాయి. అందుకే స్థిరమైన ఆదాయ వనరులు ఉన్నాయని బ్యాంకుకు చూపించాలి. అలాగే స్థిరాస్తులు, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ పెట్టుబడులు వంటివి సైతం హామీగా చూపించవచ్చు. అలాగే మీ రుణ- ఆదాయ నిష్పత్తిని బ్యాంకులు అంచనా వేసి మీ లోన్ రీపేమెంట్ సామర్థ్యాన్ని చెక్ చేస్తాయి. ఈ నిష్పత్తిని 40 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇతర రుణాలు ఏమీ లేకుంటే సైతం బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి.
మరోవైపు.. స్థిర ఆదాయం, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న యువ కుటుంబ సభ్యులను సహ దరఖాస్తుదారుడిగా చేర్చుకోవడం ద్వారా రుణ అర్హతను పెంచుకోవచ్చు. పిల్లలు, జీవిత భాగస్వామిని సహ దరఖాస్తుదారుడిగా చేర్చడం ద్వారా లోన్ పొందే అవకాశాలు మెరుగుపడతాయి. రుణ మొత్తాన్ని పెంచుకోవచ్చు. సీనియర్ల ఆదాయం, లక్ష్యాలకు అనుగుణంగా తగిన రుణ ఎంపికల కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి. 70 సంవత్సరాల వయసు దాటితే లోన్ పొందడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 75 ఏళ్లలోపే లోన్ తిరిగి చెల్లించా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.