ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ బీఓబీ కార్డ్ లిమిటెడ్ సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును రూపొందించింది. తియారా క్రెడిట్ కార్డు పేరిట ఈ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, లైఫ్ స్టైల్ కేటగిరీల్లో పలు ప్రయోజనాలతో పాటుగా రివార్డు పాయింట్లూ ఇస్తోంది. అంతే కాదు రూపే నెట్‌వర్క్ పై ఈ క్రెడిట్ కార్డు పని చేయనుంది. అంటే యూపీఐ సేవలనూ వినియోగించుకునే అవకాశం కార్డు యూజర్లు ఉంటుంది.
తియారా క్రెడిట్ కార్డు తీసుకున్న మహిళలు మింత్రా, ఫ్లిప్ కార్ట్, నైకా, లాక్మే సలోన్, అర్బన్ కంపెనీలకు చెందిన వోచర్లు ఉచితంగా పొందుతారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, గానా ప్లస్ వాటిల్లో ఫ్రీ మెంబర్ షిప్ సైతం లభిస్తుంది. సినిమా టికెట్ల బుకింగ్ పైన రాయితీ లభిస్తుంది. మొత్తంగా వోచర్లు, మెంబర్‌షిప్‌ల కలిపి రూ.31 వేల ప్రయోజనాలు అందిస్తున్నామని బీఓబీ కార్డ్ లిమిటెడ్ తెలిపింది.
తియారా క్రెడిట్ కార్డు పొందాలంటే జాయినింగ్ ఫీ రూ.2499 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక రుసుము సైతం ఇంతే మొత్తం కట్టాలి. కార్డు పొందిన 60 రోజుల్లో రూ.25 వేలు విలువైన ట్రాన్సాక్షన్లు చేస్తే జాయినింగ్ ఫీ వాపస్ ఇస్తారు. ఏడాదిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము సైతం రద్దవుతుంది. ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్ కొనుగోళ్లపై ప్రతి రూ.100కు 15 రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఇతర ట్రాన్సాక్షన్లకు అయితే ప్రతి రూ.100కు 3 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో రూ.500 వరకు యూపీఐ పేమెంట్లకు మాత్రమే రివార్డ్స్ లభిస్తాయి. ప్రతి త్రైమాసికంలో రూ.500 విలువైన నైకా, ఫ్లిప్ కార్ట్, మింత్రా డిస్కౌంట్ వోచర్లు లభిస్తాయి. ఇక రూ.1500 విలువ చేసే లాక్మే సలోన్ వోచర్ ఉచితంగా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, గానా ప్లస్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. బుక్ మై షోలో సినిమా టెకిట్లు బుకింగ్ చేస్తే రూ.250 డిస్కౌంట్ వస్తుంది. ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉంటుంది. ఏడాదిలో 3 నెలల పాటు స్విగ్గీ వన్ మెంబర్ షిప్ ఉంటుంది. రూ.250 విలువైన బిగ్ బాస్కెట్ డిస్కౌంట్ వోచర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తుంది. వీటితో పాటు హెల్త్ ప్యాకేజీ, రూ.10 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీల్లో అన్ లిమిటెడ్ లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్ సర్ ఛార్జి రద్దు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.