ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మరోసారి వస్తు సేవల పన్ను (GST) డిమాండ్ నోటీసులు పంపించింది. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీపై జీఎస్‌టీ చెల్లించడం లేదని, బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తమకు నోటీసు అందిన విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో కంపెనీ వెల్లడించింది. మొత్తం రూ. 803.4 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీసు వచ్చినట్లు తెలిపిది.
' 2019 అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31 వరకు వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ. 401.70 కోట్లు ఉన్నట్లు మహారాష్ట్రలోని ఠాణె జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. దానిపై వడ్డీ, పెనాల్టీ మరో రూ. 401.70 కోట్లు విధించారు.' అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో తెలిపింది. డిమాండ్ నోటీసుపై సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేస్తామని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన కేసుగా పేర్కొంది. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో ఆహార పదార్థాల ధరతో పాటు ఫుడ్ డెలివరీ ఛార్జీ, ప్లాట్ ఫామ్ ఫీ వంటివి ఉంటాయి. ప్రీమియం సబ్‌స్కిప్షన్ యూజర్లకు డెలివరీ ఛార్జీలు ఉండవు. ప్లాట్ ఫామ్ ఫీపై 5 శాతం ట్యాక్స్ ఉంటుంది. దీనిని 2022, జనవరి నుంచి అమలు చేస్తున్నారు.
కేంద్రం నుంచి జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందినట్లు వెల్లడించిన క్రమంలో జొమాటో షేరు నష్టాల్లోకి జారుకుంది. క్రితం రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ ముగింపు ధర రూ. 284.90తో పోలిస్తే ఒక దశలో 2 శాతానికి పైగా నష్టపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుంది. ఈ వార్త రాసే సమయానికి 0.16 శాతం నష్టంతో రూ. 284.45 వద్ద ట్రేడింగ్ అవుతోంది.