ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది.
అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో భారీ వర్షం కురిసి మైదానమంతా నీటితో నిండిపోయింది. గ్రౌండ్ అంతా చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా రెండున్నర సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (19*), మెక్‌స్వీనీ (4*) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు జరిగాయి. అశ్విన్, హర్షిత్ రానాల స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో వచ్చింది. స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.