‘సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన నిజమైన యుగపురుషుడు ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. అప్పటి వరకు పోరాటం సాగిస్తాం. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే ఆ గౌరవం తెలుగుజాతికే కాదు, దేశానికి దక్కుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ప్రైవేటు రిసార్ట్స్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌పై రూపొందించిన ‘తారకరామం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యుగపురుషులను సమాజం ఎప్పటికీ మరవదన్నారు.
దీనికి ఎన్టీఆర్ నిదర్శనమన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తెలుగువారి ఆత్మగౌరవం, అచ్చ తెలుగుదనంగా మారారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో సీఎం కావడం ఒక చరిత్ర. 1945లో మద్రాసుకు రైలు ఎక్కాక ఆయన జైత్రయాత్ర ఆగలేదు. సినీ పరిశ్రమలో ముందుగా జీతానికి ఉద్యోగంలో చేరి తర్వాత వెండితెరను ఏలారు. ప్రస్తుతం మూడేళ్లకు ఒక చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఆయన ఏడాదికి పది చిత్రాల్లో నటించేవారు.ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలను పోషించారు. రాముడు-రావణుడు, కృష్ణుడు-దుర్యోధనుడు ఇలా వైరుధ్య పాత్రలను పోషించినప్పుడు వాటికి ఎలా న్యాయం చేస్తారని పలుమార్లు నేను ప్రశ్నించాను. ఒక్కొక్కరిలో ఒక్కో గుణం ఉంటుందని, దాన్నే తాను చూపిస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారు. సినిమాల్లో అనేక ప్రయోగాలు చేశారు. సినీరంగంలో 24 ఫ్రేమ్‌లను తెలియజేశారు. శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి పాత్రలను పోషించాల్సి వచ్చినప్పుడు మాంసాహారం తీసుకునేవారు కాదు. నేలపైనే నిద్రించేవారు. తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం ఆయన శేషజీవితాన్ని అంకితం చేశారు. తొమ్మిది నెలల పాటు చైతన్యరథంపై రాష్ట్రమంతా పర్యటించారు. చివరికి పిల్లల పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా ప్రజల మఽధ్య ఉన్నారు. ఆయన సీఎంగా పాలనకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఢిల్లీని గజగజలాడించి నేషనల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదాన్ని తీసుకొచ్చారు. క్యాపిటలిజం, కమ్యూనిజం.. మీది ఏ ఇజం అన్న విలేకరుల ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా హ్యూమనిజం అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపొందించాం. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది’ అని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa