చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు.డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించలేదని పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా..తాజాగా ఈ ట్యాబ్లెట్‌కి సంబంధించి మరో అధ్యయనం విడుదలైంది.
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ మాత్రల గురించి సంచలన అంశాలు వెలువడ్డాయి. పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అవయవాలకు సంబంధించిన వ్యాధులు సోకి ప్రాణాలకే ముప్పని అధ్యయనంలో తేలింది. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణాశయంలో అల్సర్ కారణంగా జరిగే రక్తస్రావం ముప్పు 24 శాతం, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ 36 శాతం అదే విధంగా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి 19 శాతం, హార్ట్ ఫెయిల్యూర్ 9 శాతం పెరగవచ్చని నిపుణులు వెల్లడించారు. దీంతో పారాసిటమాల్ మాత్రలు వాడేవాళ్లలో మరోసారి ఆందోళన పెరిగింది.