బలహీనవర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు బాధపడే సంఘటన జరిగిందని, ఈ విషయంలో కార్యకర్తలు తనను క్షమించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సర్ధార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం మీద వివిధ పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.చంద్రబాబు, లోకేశ్ తనకు ఇచ్చిన గౌరవాన్ని జీవితంలో మర్చిపోలేనని, తనను ఆదరించిన కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసినందుకు మరోసారి క్షమాపణ చెబుతున్నానన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కార్యకర్తలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.పార్టీరహితంగా, టీడీపీ మంత్రిగా, నూజివీడులో టీడీపీ అభ్యర్ధిగా... విగ్రహావిష్కరణకు సహాయ సహకారాలు ఉంటాయని, తన అవసరం ఉందనుకుంటే చేస్తానని గౌడ సంఘం సోదరులకు హామీ ఇచ్చానన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల నుంచి... కార్యక్రమ ఏర్పాట్ల వరకు టీడీపీకి గానీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు గానీ, ఎలాంటి ప్రమేయం లేదని చెబుతున్నానన్నారు.ఈ కార్యక్రమాన్ని కేవలం గౌడ సంఘానికి సంబంధించిన వారు మాత్రమే నిర్ణయించారన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఏ తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో చెప్పాలని గౌడ సంఘ నాయకులు తన వద్దకు చ్చారని, తాను డిసెంబర్ 15వ తేదీని సూచించినట్లు చెప్పారు. ఆ తర్వాత తనకు ఇన్విటేషన్ పంపించినా అది పూర్తిగా చదివే సమయం లేక పూర్తిగా గమనించలేదన్నారు. 15 వ తారీఖు ఐ అండ్ పీఆర్ మీటింగ్ ఉందని విగ్రహావిష్కరణకు రాలేనని కార్యక్రమాన్ని మీరే చేయాలని గౌడ సంఘ నేతలతో చెప్పానన్నారు. కానీ తాను రావాలని, తన కోసం ప్రోగ్రాంను మధ్యాహ్నానికి వాయిదా వేస్తామని వారు తనకు చెప్పారని, దీంతో అంగీకరించవలసి వచ్చిందన్నారు. ఐ అండ్ పీఆర్ మీటింగ్ పూర్తిచేసుకుని కార్యక్రమానికి హాజరయ్యనని, అక్కడకు వెళ్లిన తాను 'ఆ వ్యక్తి'ని చూసి షాక్‌కు గురయ్యానన్నారు. అది గౌడ సంఘం కార్యక్రమం కాబట్టి తాను సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వకుండా... కార్యకర్తలకు మాత్రం క్షమాపణలు చెబుతున్నానన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అందరూ టీడీపీ నాయకులేనని వెల్లడించారు.