తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి 24 గ్రాముల బంగారం, రూ.30వేల నగదు దోచుకెళ్లారు. స్థానికుల వివరాల ప్రకారం.. దూబచర్ల గ్రామానికి చెందిన విశ్రాంత వ్యవసాధికారి చీమకుర్తి వీరభద్ర అప్పల కృష్ణమూర్తి తన భార్య లక్ష్మీకుమారితో కలిసి పాత ఇండియన్ బ్యాంకు ఉన్న ఇంట్లో జీవిస్తున్నారు. లక్ష్మీకుమారి అనారోగ్యంతో మంచంపైనే ఉంటున్నారు. ఆమెకు సహాయకురాలిగా అదే గ్రామానికి చెందిన జుత్తింగ పెద్దింట్లను నియమించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కృష్ణమూర్తి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడే ఉన్న పెద్దింట్ల.. ఎవరు అంటూ ప్రశ్నించే లోగా ఆమెను కొట్టి చీరతో చేతులు కట్టేశారు. ఆపై కృష్ణమూర్తి చేతులను సైతం తాళ్లతో కట్టి బంధించి లక్ష్మికుమారి మెడలో బంగారు ఆభరాణాలతోపాటు బీరువా పగులగొట్టి ఆభరణాలు, రూ.30 వేల నగదు దోచుకుని వెళ్లిపోయారు. సంఘటన నుంచి తేరుకున్న కృష్ణమూర్తి 112కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎప్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, దేవరపల్లి సీఐ బీన్ నాయక్, ఎస్‌ఐ సోమరాజు, రమేష్, బాలాజీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్రలు సేకరించి, డ్యాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.