మనం ఏదైనా పనికోసమో, షాపింగ్ కోసమో బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ మంది జనాలు ఉండే బాత్రూంలను వాడేందుకు చాలా భయపడుతుంటాం. ఇక్కడ ఏమైనా స్పై కెమెరాలు ఉన్నాయోమోనని పదే పదే చెక్ చేస్తుంటాం. మరీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లోని డ్రెస్ చేంజింగ్ గదులతో పాటు హోటళ్లలోని బాత్రూంలకు వెళ్లినప్పుడు కాసేపు గదంతా వెతికేస్తుంటాం. ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ బాత్రూంలను వాడుతుంటాం. కానీ బడి, గుడి వంటి వాటి వద్దకు వెళ్లినప్పుడు ఆ ప్రయత్నం చేయం. ఎందుకంటే అక్కడ ఎలాంటి తప్పు జరగదన్న నమ్మకం.
కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా అమ్మాయిలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్లే స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయుల బాత్రూంలో స్పై కెమెరా బయట పడింది. ఈ ఘటనతో అంతా షాక్ అవుతున్నారు. పబ్లిక్ బాత్రూంలలో చెక్ చేసినట్లే ఇలాంటి చోట్ల కూడా చెక్ చేసుకొని వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు. మరి ఈ దారుణం ఎక్కడ జరిగింది, ఎవరు, ఎందుకు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నోయిడాలోని సెక్టార్ 70లోని ప్లే స్కూల్లో ఎప్పటిలాగే ఓ మహిళా ఉపాధ్యాయురాలు బాత్రూంకు వెళ్లింది. అయితే అనుకోకుండా గదిని పరిశీలించి చూసిన ఆమెకు అక్కడ ఓ స్పై కెమెరా కనిపించింది. దాంతో షాకైన ఈ టీచర్ దాన్ని బయటకు తీసుకు వెళ్లి మరీ అందరికీ చూపించింది. వెంటనే స్కూల్ డైరెక్టర్ నవనీష్ సహాయ్, స్కూల్ కోఆర్టినేటర్ పరుల్‌కు ఫిర్యాదు చేసింది. ఇది ఎవరు చేశారో తెలుసుకోండి సార్ అంటూ చెప్పింది. అదంతా విన్న అతడు అదేం అయ్యుండదని.. దాన్ని మర్చిపొమ్మని చెప్పాడు.
స్కూల్ యాజమాన్యం.. బాత్రూంలో స్పై కెమెరా గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆమెకు అనుమానం కల్గి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బడిలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా ఓసారి బాత్రూంలో తనకు స్పై కెమెరా దొరికిందని ఉపాధ్యాయురాలు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ పనికి పాల్పడింది స్కూల్ డైరెక్టర్ నవనీష్ సహాయ్‌యే అని తెలిసింది. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో నవనీష్ నేరం ఒప్పుకుని.. జరిగిందంతా చెప్పాడు.
తానే ఆన్ లైన్ ద్వారా 22 వేల రూపాయలు పెట్టి స్పై కెమెరా కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. దాన్ని లేడీ టీచర్ల బాత్రూంలో పెట్టి.. తన కంప్యూటర్, మెబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నట్లు వివరించాడు. దాని ద్వారానే.. బాత్రూంలో జరిగే సన్నివేషాలను చూసినట్లు ఒప్పుకున్నాడు. ఇది తెలుసుకున్న స్కూల్లోని మహిళా ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. ఇన్నాళ్లు తమ ముందు మంచిగా ఉన్న వాడే.. తమను అసభ్యంగా చూడాడని కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం స్కూల్‌పై విచారణ సాగుతున్నందున పాఠశాలను మూసేశారు.