బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైందని చెప్పొచ్చు. చిన్న చిన్న అవసరాల కోసం కూడా లోన్ల కోసం వెళ్తున్నారు. పెళ్లి ఖర్చుల కోసం, కుటుంబంతో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రయాణాలకు ఖర్చులు, ఫ్రెండ్స్‌తో వెకేషన్‌కు వెళ్లాల్సి వస్తే ఖర్చుల కోసం, వైద్య ఖర్చుల కోసం కూడా బ్యాంకులను పర్సనల్ లోన్ కోసం ఆశ్రయిస్తాం. ఇప్పట్లో చాలా బ్యాంకులు లోన్ ప్రాసెస్ వేగంగా చేస్తున్నాయి. పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండానే.. ఈజీగా డబ్బుల్ని అకౌంట్లో వేస్తున్నాయి. అయితే ఇందుకోసం మంచి సిబిల్ స్కోరు, మంచి ఆదాయం ఉండాలి. ఇవి అన్ సెక్యుర్డ్ లోన్లు కాబట్టి వడ్డీ రేట్లు.. ఇతర లోన్ల కంటే కాస్త ఎక్కువగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా.. మంచి సిబిల్ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు కాస్త తక్కువగా పడుతుంది. లోన్ తీసుకున్నప్పుడు మనకు నెలకు ఈఎంఐ ఎంత పడుతుంది.. తిరిగి చెల్లించే స్థోమత మనకు ఉందా అనేది ప్రధానంగా తెలుసుకోవాలి.
బ్యాంకుల్ని బట్టి లోన్ వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఇంకా లోన్ ఎంత తీసుకున్నాం.. దానిపై వడ్డీ రేటు ఎలా ఉంది.. ఎన్నేళ్ల పాటు తిరిగి చెల్లించాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈఎంఐ ఎంత అనేది తెలుస్తుంది. లోన్ వడ్డీ రేటుకు, ఈఎంఐకి అనులోమానుపాత సంబంధం ఉంటుంది. అంటే లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే.. ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రేటు తక్కువైతే.. ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఇక లోన్ వ్యవధి.. ఈఎంఐకి విలోమ సంబంధం ఉంటుంది. అంటే.. లోన్ డ్యురేషన్ తక్కువగా ఉంటే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. అదే లోన్ వ్యవధి ఎక్కువగా ఉంటే.. ఈఎంఐ తగ్గుతుంది. ఎక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఇప్పుడు మనం ఉదాహరణకు ఏదైనా బ్యాంకులో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నామనుకుందాం. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 12 శాతం వడ్డీ రేటు లెక్కన ఈఎంఐ.. ఎన్ని సంవత్సరాలకు ఎంత పడుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఇది తెలుసుకోవచ్చు.
5 లక్షల లోన్ ఈఎంఐ..
ఒక ఏడాది కాలానికి 5 లక్షల రుణం తీసుకున్నట్లయితే.. 12 శాతం వడ్డీ రేటు చొప్పున నెలకు రూ. 44,424 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. టెన్యూర్ తక్కువ కాబట్టి ఈఎంఐ ఎక్కువ పడుతుంది. ఇంకా.. రెండేళ్ల వ్యవధికి అయితే నెలకు రూ. 23,536 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఇదే మూడేళ్లకు నెలకు రూ. 16,607 చొప్పున ఈఎంఐ పడుతుంది. ఇలానే వ్యవధి పెరిగే కొద్దీ.. ఈఎంఐ తగ్గుతూ వస్తుంది. నాలుగేళ్లకు అయితే ఈఎంఐ రూ. 13,166 చొప్పున పడుతుంది. ఇదే సమయంలో 5 లక్షల లోన్ తీసుకొని.. 12 శాతం వడ్డీకి అయితే.. ఐదేళ్లలో నెలకు రూ. 11,122 ఈఎంఐ చెల్లించాలి.
10 శాతం వడ్డీకి లోన్..
కొన్ని బ్యాంకుల్లో ఇంకా తక్కువ వడ్డీకే లోన్ లభించొచ్చు. ఉదాహరణకు 10 శాతం వడ్డీకి 5 లక్షల లోన్ వస్తే.. అప్పుడు ఐదేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 43,957 చొప్పున పడుతుంది. ఇక్కడ ఐదేళ్లకు అయితే నెలకు రూ. 10,623 చొప్పున పడుతుంది. ఇలాగే ఇతర అన్ని రకాల లోన్లపై.. వడ్డీ రేటుతో.. ఎన్నేళ్లకు ఈఎంఐ ఎంత అవుతుందన్నది లెక్కించుకోవచ్చు. ఇందుకోసం.. లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్స్ ఉపయోగించొచ్చు.