హనీమూన్ కు ఎక్కడికి వెళ్లాలనే విషయంపై కొత్త అల్లుడితో గొడవ పడ్డ ఓ మామ తీవ్రంగా స్పందించాడు. అల్లుడి ఇంటి వద్ద కాపుకాచి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అల్లుడు ఆసుపత్రిలో చేరగా మామ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే..ఠాణె జిల్లా కల్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జకీ గులామ్ ముర్తజా ఖోటాల్ (65) ఇటీవల తన కూతురును ఇబాద్ అతీక్ ఫాల్కే (29)కు ఇచ్చి వివాహం చేశాడు. హనీమూన్ వెళ్లే విషయంపై మామాఅల్లుళ్ల మధ్య వివాదం రేగింది. కశ్మీర్ కు వెళతామని ఫాల్కే చెప్పగా, వద్దు విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లండని ఖోటాల్ సూచించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గొడవ పెద్దదవుతుండడంతో ఇంట్లో వాళ్లు కలగజేసుకున్నారు. దీంతో ఖోటాల్ తాత్కాలికంగా వెనక్కితగ్గాడు.అయితే, ఖోటాల్ కు అల్లుడిపై కోపం మాత్రం తగ్గలేదు. సాయంత్రం యాసిడ్ సంపాదించి అల్లుడి ఇంటి దగ్గర కాపుకాచాడు. తన కారులో కూర్చుని అల్లుడు వచ్చే వరకు ఎదురుచూశాడు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న ఫాల్కే.. రోడ్డు పక్కన తన స్కూటర్ పార్క్ చేసి ఇంట్లోకి వెళుతుండగా ఖోటాల్ సడెన్ గా ఎదురు వచ్చి యాసిడ్ చల్లి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఫాల్కేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫాల్కే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖోటాల్ కోసం గాలిస్తున్నారు.