గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైబర్‌నెట్ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైలులో మార్పులు, చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్) చైర్మన్ జీవీరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫైలులో కొత్తగా ఏమైనా రాశారా లేదా తొలగించారా అనే అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అత్యంత కీలకమైన ఈ ఫైలును వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సిఫారసుతో ఉద్యోగంలో చేరిన మహిళ చేతిలో ఎందుకు ఉంచారో అర్థంకావడం లేదన్నారు.
ఆమెకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదని, కేవలం వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే విధులు అప్పగించి, అధికారులు జీతం చెల్లిస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆమె ఉద్యోగంలో కొనసాగారని, ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. గురువారం ఫైబర్‌నెట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలకమైన ఫైలును ఆ మహిళా ఉద్యోగికి అప్పగించిన అధికారులపై చర్యలు ఉండవా అన్న ప్రశ్నకు.. అన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.