బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో మరోసారి వాతావరణ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో నేడు(శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 60కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.