ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 11:25 AM

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 19 నుండి మార్చి1 వరకు నిర్వహించనున్నారు. 11రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం శ్రీశైలం కార్యనిర్వాహణ అధికారి ఎం.శ్రీనివాసరావు దేవస్థానం, ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షకులు, వైదిక కమిటీతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ కె.వి.శ్రీనివాసులు, అటవీశాఖ రేంజ్ అధికారి సుభాష్ రెడ్డి, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డా.ఆర్.శ్రీవాణి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎ.ఎస్.ఐ బి.సి.గురువయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డా.టి. శశిధర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా గత సంవత్సరపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు.


అనంతరం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ..జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధవహించాలని కోరారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు. అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆయా విభాగాల పరంగా చేపట్టాల్సిన చర్యలకు తగు ముందస్తున్న ప్రణాళికలను రూపొందించాలన్నారు. అనుగుణంగా ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఫిబ్రవరి మొదటివారం చివరిలోగానే పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తుగానే భక్తులు క్షేత్రానికి చేరుకుంటారని చెబుతూ అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తుగా పూర్తికావడం తప్పనిసరి అన్నారు. దేవస్థానం ఉద్యోగులందరూ కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దేవస్థానం అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం కంటే కూడా ప్రతీచోటకూడా అవకాశం మేరకు 20శాతం నుంచి 30శాతం దాకా అదనపు ఏర్పాట్లు ఉండాలన్నారు.


 


ఇక మహా శివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. అనంతరం పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అటవీశాఖ సహకారముతో నడకదారిలో వచ్చే భక్తులకు ఆయా ఏర్పాట్లను కల్పించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లు మొదలైనవాటి గురించి పలు ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com