ఏపీలోని ఇంటర్మీడియట్ విద్యా్ర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీల్లో ఇంటర్ చదివే సుమారు లక్షా 40 వేల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనే దానిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాన్నం భోజనం పధకం ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే విద్యా కిట్లు అందించనున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు రైతులను మభ్యపెట్టిందని అచ్చెన్న విమర్శించారు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా.. వైసీపీ నాయకుల్లో మార్పు కనిపించడం లేదని.. గతంలో మాదిరిగానే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని.. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పధకాలు కూడా వినియోగించుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిన పెట్టామన్న అచ్చెన్నాయుడు.. రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించామన్నారు. కూటమి ప్రభుత్వంలో శివారు ప్రాంతాలకు సాగునీరు ఇచ్చామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత కూడా.. రైతుల అకౌంట్లలోకి డబ్బులు పడేవి కావన్న అచ్చెన్నాయుడు.. రైతులకు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుత టీడీపీ సర్కారు ధాన్యాన్ని నిమిషాల మీద కొంటోందని.. 4 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటి వరకూ 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. 3 లక్షల 28వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు.