ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాస్తే నవల.. తీస్తే సినిమా.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఉండి ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 07:06 PM

ఈ ప్రపంచంలో ప్రతీ ప్రశ్నకు ఓ సమాధానం ఉంటుంది.. మనం చేయాల్సిందల్లా ఆ సమాధానం కోసం శక్తివంచన లేకుండా అన్వేషించడమే.. సమాధానం దొరికే క్రమంలో సమయం పట్టినా.. అంతిమ విజయం మాత్రమే సత్యానిదే. అలాంటి ఓ సత్యం కోసం, ఆ నిజం వెనుక దాగున్న భయంకర రహస్యాన్ని ఛేదించడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే వారి ముందు ఎన్నో చిక్కుముడుల్లాంటి ప్రశ్నలు.. వాటికి సమాధానాలు వెతికే ప్రక్రియలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. అసలేంటీ కథ.. ఏమిటా ప్రశ్నలు.. ?


యండగండి.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఓ గ్రామం. గోదారమ్మ పరవళ్లూ, వరి చేల సౌందర్యం మధ్య ప్రశాంత జీవితం గడుపుతున్న పల్లె. ఆ ఊర్లో ఉండే ముదనూరి రంగరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె తులసి.. రెండో కూతురు రేవతి. ఇద్దరూ కూతుర్లను అపురూపంగా పెంచుకున్న రంగరాజు వారికి పెళ్లిళ్లు జరిపించాడు. పెద్ద కుమార్తె తులసిని నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. 20 ఏళ్ల కిందట పెళ్లి జరగ్గా.. పదేళ్ల క్రితంసాగి శ్రీనివాసరావు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అప్పులు తీర్చలేక ఇల్లు విడిచి వెళ్లిపోయారు. దీంతో కుమార్తెతో కలిసి తులసి పుట్టింటికి వచ్చేశారు.


పుట్టింటికి వచ్చేసిన తులసి భీమవరంలో ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం మంజూరైంది. అయితే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినన్ని డబ్బులు, ఆర్థిక స్థోమత లేకపోవటంతో తులసి ఓ సేవా సంస్థను ఆశ్రయించారు. తులసి ఒంటరి మహిళ కావటంతో సేవా సంస్థ కూడా ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇంటి నిర్మాణానికి కావాల్సిన టైల్స్, రంగు డబ్బాలను ఓ సారి పార్శిల్ ద్వారా పంపించింది. దీంతో తులసి సంతోషపడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని సంబరపడ్డారు.


పార్శిల్‌లో డెడ్ బాడీ.. వణికిపోయిన కుటుంబం


అయితే తులసికి ఇటీవల మరోసారి మెసేజ్ వచ్చింది. ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన కరెంట్ సామాగ్రి, మోటార్ పంపుతున్నామని సందేశం వచ్చింది. దీంతో గతంలో సాయం చేసిన వారే మరోసారి సహాయం అందిస్తున్నారని తులసి భావించారు. ఆ తర్వాత ఓ ఆటోలో పెద్ద పెట్టె తీసుకుని ఇద్దరు వ్యక్తులు తులసి ఇంటికి వచ్చారు. ఆమె ఇంట్లో పార్శిల్ దించేసి వెళ్లిపోయారు. అయితే పార్శిల్‌గా వచ్చిన చెక్క పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటంతో తులసి కంగారుపడిపోయింది. ముందు కరెంట్ సామాన్లు అనుకున్న దుర్వాసన వస్తూ ఉండటంతో.. అందులో ఏముందా అని రాత్రి వేళ తెరిచి చూసింది. దీంతో తులసి గుండెలు జారిపోయాయి. పార్శిల్‌లో వచ్చింది.. కరెంట్ సామాన్లు కాదు.. శవం. కుళ్లిన స్థితిలో ఉన్న పురుషుడి మృతదేహాన్ని చూసి తులసి, ఆమె కుటుంబం వణికిపోయింది.


 రూ.1.30 కోట్లు ఇవ్వాలంటూ డెడ్ బాడీ పార్శిల్


తులసి ఇంటికి వచ్చిన పార్శిల్‌లో 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం ఉంది. అలాగే ఆగంతకులు ఓ లెటర్ కూడా ఉంచారు. మీ భర్త మా వద్ద 2008లో అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఇప్పటికి రూ. 1.30 కోట్లు అయ్యింది. ఆ సొమ్ము వెంటనే చెల్లించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు అంటూ అందులో బెదిరింపు లేఖ.. దీంతో తులసి కుటుంబం మరింత కంగారు పడిపోయింది. ఓ వైపు శవం.. మరోవైపు భర్త గురించి వివరాలు.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఈ భయం మధ్యే తులసి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.


సీన్‌లోకి పోలీసులు.. సమాధానం లేని ప్రశ్నలు..


ఓ చెక్క పెట్టలో.. పాలిథిన్ కవర్లలో గట్టిగా చుట్టి ఆగంతకులు మృతదేహాన్ని తులసి ఇంటికి పంపించారు. శవం కుళ్లిపోయింది. రంగు మారి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అలాగే గొంతుపై తాడుతో బిగించిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాన్ని పరిశీలించిన మీదట పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో మరింత స్పష్టత వచ్చింది. ఎవరో తాడుతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారని.. హత్య జరిగి మూడు లేదా నాలుగు రోజులు కావచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అయితే ఇప్పుడు తెలియాల్సిందల్లా ఆ శవం ఎవరిది? తులసి భర్త ఏమయ్యాడు? తులసి భర్తకు ఎవరు అప్పు ఇచ్చారు? హత్య చేసిన వారికి తులసి భర్తకు సంబంధం ఉందా? శవంగా వచ్చిన వ్యక్తికి తులసి భర్తకు సంబంధం ఏంటి?


కనిపించని రేవతి భర్త.. ఇదెక్కడి ట్విస్ట్..!


అయితే ఈలోపే మరో ఊహించని ఘటన జరిగింది. పార్శిల్‌లో డెడ్ బాడీ ఇంటికి వచ్చిన తర్వాత తులసి చెల్లెలు రేవతి భర్త కనిపించకుండా పోయారు. అసలే రేవతి ఇంటికి వచ్చిన డెడ్ బాడీ ఎవరిది.. ఎవరు పంపారు అనే దానిపై విచారణ చేస్తున్న పోలీసులకు.. రేవతి భర్త కనిపించకుండా పోయారన్న వార్తలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అతనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తులసి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే డెడ్ బాడీ పార్శిల్ తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ కోసం కూడా గాలించారు. అతను కూడా దొరికినట్లు సమాచారం.


ఆటో డ్రైవర్ షాకింగ్ విషయాలు.. ఆ మహిళ ఎవరు?


కట్ చేస్తే.. డెడ్ బాడీని తులసి ఇంటికి తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఓ మహిళ ఫోన్ చేయడంతోనే పార్శిల్ తీసుకువెళ్లి ఇచ్చినట్లు అతను చెప్పినట్లు సమాచారం. సాగపాడు సమీపం నుంచి ఓ మహిళ ఫోన్‌ చేసి కిరాయికి రమ్మంటే వెళ్లానని.. 500 రూపాయలు ఇచ్చి చెక్క పెట్టెను డెలివరీ ఇవ్వమన్నట్లు డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. అంతకుమించి తనకేమీ తెలియదని డ్రైవర్‌ చెప్పినట్లు సమాచారం.


దీంతో ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసిన మహిళ ఎవరు.. ఆమెకు హత్యతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తులసికి వచ్చిన కాల్స్ వివరాలు, గ్రామంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అలాగే తులసి మరిది కనిపించకుండా పోవటం, సెల్ ఫోన్ స్విఛాప్ రావటంతో ఆయనపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న గోదారి పల్లెలో ఈ డెడ్ బాడీ డెలివరీ.. మిస్టరీగా మారింది. పోలీసులకు సవాల్ విసురుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com