ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు విజయవాడలో కలిశారు! ఉమ్మడి ఏపీలో 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేతలపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే జనవరి 8కి వాయిదా వేసింది.నాడు 21 మందిపై కేసు నమోదు కాగా, ముగ్గురు విచారణ దశలో మృతి చెందారు. మిగిలిన వారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు ఇదివరకే ఆదేశించింది.దీంతో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నం బాబు రమేశ్, కోళ్ల లలిత కుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవింద్ రెడ్డి, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ న్యాయాధికారి ఎదుట హాజరయ్యారు.ఇందులో ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్దన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. కేసు విచారణలో భాగంగా విజయవాడకు వచ్చిన వారు తమ పాతమిత్రులను ఆప్యాయంగా పలకరించారు.వీరంతా అప్పుడు టీడీపీలో ఉన్నారు. 2007 జులై 21న అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలంలోని ఓబులాపురం గనుల పరిశీలనకు వెళ్లారు. దీంతో వారిపై నాడు పోలీసు కేసు నమోదైంది. తమపై తప్పుడు కేసు బనాయించారని, తాము ఎక్కడా నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చారు.