ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపం.. 10 వేల బిట్‌కాయిన్స్‌తో 2 పిజ్జాలు కొన్నాడు.. ఇప్పుడా విలువ రూ. 8 వేల కోట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 09:17 PM

మన నిజజీవితంలో జరిగే.. చూసే.. ఎన్నో సంఘటనల్ని మనకు మనం అన్వయించుకుంటాం. ఆ ప్లేసులో మనల్ని మనం ఊహించుకున్న ఘటనలూ ఉంటాయి. ఫలానా కారు నాకే ఉంటే బాగుండేది.. ఫలానా ఇల్లు నా సొంతమైతే బాగుండేది.. నా దగ్గరే కోటి రూపాయలుంటే బాగుండేదని ఇలా చాలానే అనుకుంటుంటాం. కానీ అదే మనం అది అనుభవించాల్సి ఉన్నా.. మన చేయి దాటిపోతే.. మనకు అది దక్కకపోతే ఆ బాధ చెప్పలేం. మళ్లీ మళ్లీ తలుచుకొని బాధపడుతుంటాం. కొన్నింటి విలువ మనకు ముందుగా తెలియదు. చేయిదాటాకే అరెరే.. తప్పు చేశామే అనిపిస్తుంటుంది. నాకు రాసిపెట్టిలేదులే అనుకోక తప్పదు. ఇప్పుడు లాస్లో హనిఎజ్ అనే ఐటీ ప్రోగ్రామర్‌కు ఇది అచ్చుగుద్దినట్లుగా వర్తిస్తుంది. అతడు చేసిన పని తెలిస్తే.. పాపం అనుకోకుండా ఉండలేం. ఎంత పనిచేశాడ్రా..? అదే మనమై ఉంటేనా అనిపించకమానదు.


బిట్‌కాయిన్.. ఇప్పుడిదే ట్రెండింగ్. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తిరిగి గెలిచాక.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. కొన్నాళ్ల కిందట చాలా తక్కువ ధరకే దొరికిన ఒక్క బిట్‌కాయిన్.. కొద్దిరోజుల కింద ఏకంగా లక్ష డాలర్ల మార్కును అధిగమించింది. అంటే భారత కరెన్సీలో ఇది రూ. 85 లక్షలపైనే ఉంది. 2010లో ఇక ఒక్క బిట్‌కాయిన్ ధర 0.05 డాలర్లుగా ఉండగా.. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 2.29 కు సమానం. ఈ లెక్కల్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బిట్ కాయిన్ ధర ఎంతలా పెరిగిందోనని.


పాపం.. బిట్‌కాయిన్ ధర ఇన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేయని.. అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ పెద్ద తప్పే చేశాడు. అత్యంత దురదృష్టవంతుల్లో ఒకరిగా నిలిచాడు. అవును.. కొన్నేళ్ల కిందట ఇతడి దగ్గర 10 వేల బిట్‌కాయిన్స్ ఉండేవి. అప్పుడు దీని ధర చాలా తక్కువ. 2010 మే 17న హనిఎజ్ తన దగ్గరున్న 10 వేల బిట్‌కాయిన్స్‌ను డాలర్లలోకి మార్చుకున్నాడు. అలా వచ్చిన 41 అమెరికన్ డాలర్లతో మే 22న 2 డొమినోస్ పిజ్జాలు ఆర్డర్ చేశాడు. ఇప్పుడు బిట్‌కాయిన్ ధర చూస్తే.. అతడు కచ్చితంగా పశ్చాత్తాపం చెందాల్సిందే.


కోట్లు పోయాయ్‌గా..!


ఎందుకంటే ఇప్పుడు (డిసెంబర్ 24) ఒక్క బిట్‌కాయిన్ ధర అమెరికన్ డాలర్లలో చూస్తే 94,320 డాలర్లుగా ఉంది. అదే ఇండియన్ కరెన్సీలో అయితే ఒక్క బిట్‌కాయిన్ రూ. 80 లక్షలకుపైనే ఉంది. ఈ లెక్కన అతడి దగ్గర ఉన్న 10 వేల బిట్‌కాయిన్స్ విలువ ఇప్పటికీ తన దగ్గరే ఉంచుకున్నట్లయితే రూ. 10000x8000000= 8,00,00,000,000. ఇదెంతో తెలుసా.. ఏకంగా రూ. 8 వేల కోట్లు. అవును ఆ రెండు పిజ్జాలు కొనకుండా ఉంటే ఇప్పుడతను వేల కోట్లకు అధిపతి అయ్యుండేవాడు. ఎన్నో బంగ్లాలు.. కార్లు కొనేవాడు. అత్యంత ధనవంతుల జాబితాలోనూ ఉండేవాడనడంలో అతిశయోక్తి లేదు. అసలు బిట్‌కాయిన్ ధర ఇంత పెరుగుతుందని అతనే కాదు.. ఎవరూ ఊహించుండకపోవచ్చు. అతడనే కాదు.. అలా తెలియక అమ్మేసిన చాలా మంది ఇలాగే చింతిస్తుంటారు.


బిట్‌కాయిన్ పిజ్జా డే..


బిట్‌కాయిన్‌తో ఏదైనా వస్తువు, పదార్థం కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి లాస్లో హనిఎజ్. మరో విశేషం ఏంటంటే.. లాస్లో ట్రాన్సాక్షన్‌కు గుర్తుగానే మే 22ను బిట్‌కాయిన్ పిజ్జా డే గా జరుపుకుంటున్నారు. బిట్‌కాయిన్ యూజర్లకు ఈ రోజున పిజ్జాలపై డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి సదరు కంపెనీలు. అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేం. తొందరపడకుండా.. ఓపికతో చూస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందనే దానికి లాస్లో కథ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలానే మీరెప్పుడైనా స్టాక్స్.. గోల్డ్.. ల్యాండ్.. ఏదైనా కొని రాంగ్ టైంలో అమ్మేశామని ఎప్పుడైనా అనిపించిందా? అలా అని ఇది అన్నింటికీ ఇలా ఓపిక వర్తించదు సుమీ. నిదానమే ప్రధానం ఎలానో.. ఆలస్యం అమృతం విషం అనే సామెతా గుర్తుపెట్టుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa