రాంబిల్లి మండలంలోని గోవిందపాలెం గ్రామంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఇసరపు రమణ తన గొర్రెల మందను గురువారం రాత్రి స్థానికంగా ఉన్న ఒక కొబ్బరి తోటలో ఉంచి, చుట్టూ ఇనుప కంచె వేశాడు. శుక్రవారం ఉదయం ఎవరూలేని సమయంలో కుక్కల గుంపు కొబ్బరి తోటలోకి ప్రవేశించి గొర్రెలపై విచక్షణారహితంగా దాడి చేశాయి.
సుమారు 30 గొర్రెలు తప్పించుకుని తలోదిక్కుకు పారిపోగా, 15 గొర్రెలు కుక్కలబారినపడి మృతిచెందాయి. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న రమణ అక్కడకు వచ్చి తీవ్ర ఆవేదన చెందాడు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా డైరెక్టర్ జి.దేముడునాయుడు వచ్చి మృతిచెందిన గొర్రెలను పరిశీలించారు. కుక్కల దాడిలో గొర్రెలను కోల్పోయిన రమణను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.