ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం, ఏపీలోని విశాఖపట్నానికి చెందిన నితీశ్ రెడ్డి సెంచరీ కొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ప్లేయర్.. భారత తరఫున తన తొలి సెంచరీ నమోదు చేశాడు. టాప్ నుంచి మిడిలార్డర్ వరకు బ్యాటర్లు పెవిలియన్ చేరిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్.. జట్టును ఆదుకున్నాడు. 21 ఏళ్ల వయసులోనే ఎంతో పరిణతి చెందిన ఆటగాడిగా కన్పించాడు. స్టార్క్, కమిన్స్ లాంటి పేసర్లను తట్టుకుని పరుగులు రాబట్టాడు.
అయితే నితీశ్ రెడ్డి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు అతడి సహచర ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే బుమ్రా ఔట్ కావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సిరాజ్ కూడా ఔట్ అయితే.. నితీశ్ 99 పరుగులకే పరిమితమయ్యేవాడు. కానీ కమిన్స్ బౌలింగ్‌లో సిరాజ్ మూడు బంతులు డిఫెండ్ చేయడంతో.. నితీశ్‌కు స్ట్రైక్ వచ్చింది. అనంతరం ఫోర్ కొట్టిన ఈ ఏపీ ప్లేయర్.. తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. కుమారుడు సెంచరీ చేసిన మైదానంలో నుంచి మ్యాచ్ వీక్షించిన నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ముత్యాలరెడ్డిని అతడి చుట్టు పక్కల మ్యాచ్ చూస్తున్న వారు అభినందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనంతరం మాట్లాడిన ముత్యాల రెడ్డి.. ఈ రోజు తమ కుటుంబానికి ప్రత్యేకమైన రోజని అన్నారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పుకొచ్చారు. నితీశ్ సెంచరీని ప్రత్యక్షంగా చూడటాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మూడో రోజు ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ వేపు వస్తున్న నితీశ్‌కు భారత ప్లేయర్లు చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ సహా మిగతా ప్లేయర్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు
కాగా నితీశ్ రెడ్డి క్రికెటర్‌గా రాణించడంతో అతడి తండ్రి ప్రోత్సాహం మరువలేనిది. నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి గతంలో హిందుస్థాన్ జింక్‌లో పని చేసేవారు. అయితే ఆయనకు ఉదయ్‌పూర్‌కు బదిలీ కావడంతో.. అక్కడ తన కుమారుడు ఆటకు అనువైన పరిస్థితులు లేవని, రాజకీయాల ప్రభావంతో ఆట దెబ్బతింటుందని భయపడ్డారు. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికీ నితీశ్ వయసు 12-13 ఏళ్లే. నితీశ్‌పై నమ్మకంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై సెంచరీతో నితీశ్.. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు