ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద నియామకంపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌గా నియమితులైన విజయానందకు మంత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కె. విజయానందకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం అంటేనే బీసీ, ఎస్సీ వర్గాల ప్రతినిధి అని మరోసారి రుజువయిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుందన్నారు. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం అవకాశం కల్పించారన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారి శ్యామల రావు నియమితులయ్యారన్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావుకూడా బీసీనే అని అన్నారు.తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ ఉన్నారన్నారు. అలాగే శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం కల్పించారని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే జగన్ రెడ్డి నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడంలో సీఎస్‌గా విజయానంద్ విజయవంతంగా పనిచేయగలరని ఆకాంక్షిస్తున్నాన్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.