రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 20, 2024 రోజున ఘోర ప్రమాదం జరిగింది. జైపూర్- అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాకర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 35కుపైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగినరోజే 11 మంది మృతి చెందగా కొంత మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, జైపూర్ ఎల్‌పీజీ ట్యాంకర్ పేలుడు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకాశాన్ని తాకేలా పేలుడు సంభవించినట్లు ఆ వీడియో దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఈ వీడియో అసలు జైపూర్ ప్రమాదానికి సంబంధించినది కాదని తేలింది. మరి ఆ వీడియో ఎక్కడిది?
అసలు నిజం ఏంటి?
జైపూర్ ఎల్‌పీజీ ట్యాంకర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. అయితే, వైరల్ వీడియోలోని దృశ్యాలు జైపూర్ ఘటనకు సంబంధించినవి కావు. అవి లెబన్‌లో జరిగిన పేలుడు దృశ్యాలుగా తేలింది.
ఎలా తెలుసుకున్నామంటే?
డిసెంబర్ 20 తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జైపూర్- అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే సమయంలో బెడ్‌షీట్లతో వెళ్తున్న మరో ట్రక్కు ఢీకొట్టింది. దీంతో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించి సుమారు 35 వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మొత్తం 20 మందికిపైగా చనిపోయారు. అయితే, ఈ పేలుడుకు సంబంధించిన వీడియోగా పేర్కొంటూ కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ భవనం పై నుంచి వీడియోను తీస్తుండగా దూరంలో భారీ పేలుడు సంభవించినట్లు చూపించారు. ఈ వీడియో మీద జైపూర్ ఎల్‌పీజీ అని పేర్కొన్నారు. ఈ వీడియోకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం గమనార్హం.
అయితే, వైరల్ వీడియోకు జైపూర్‌లో ఘటనకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిగిన పేలుడు దృశ్యాలుగా ధ్రువీకరించాం. వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ద్వారా గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సర్చ్ ద్వారా వెతికాం. ఈ క్రమంలో ఆగస్టు 5, 2020న మిర్రర్ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఓ కథనం లభించింది. అది బీరుట్‌లో జరిగిన పేలుడుగా తేలింది. మరిన్ని రిజల్ట్స్ పరిశీలించాం. ఎన్‌బీసీ న్యూస్ సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఆగస్టు 5, 2020న పోస్ట్ చేసిన ఓ వీడియో లభించింది. అందులో లెబనాన్‌లో భారీ పేలుడు సంభవించింది డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు అని పేర్కొంది.
వైరల్ వీడియో, ఎన్‌బీసీ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లోని వైడియో ఒకటేనని మేము ధ్రువీకరించాం. అలాగే బీరుట్ పేళ్లలకు సంబంధించిన వీడియోలను సైతం యూట్యూబ్‌లో సర్చ్ చేశాం. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ వీడియోలను పోస్ట్ చేశాయి. ఆగస్టు 4, 2020న లెబనాన్‌లోని బీరుట్‌లో సాయంత్రం 6.07 గంటలకు 2750 టన్నుల అమ్మెనియం నైట్రేట్ పేలినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది భారీ పేలుడుకు దారితీసింది. 6 వేల మందికిపైగా గాయపడ్డారు. 200 మందికిపైగా మరణించారు. 3 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు.
అసలు వాస్తవం ఇది...?
వైరల్ వీడియోకు, జైపూర్ ఎల్‌పీజీ ట్యాంకర్ పేలుడుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.