ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖలో రూ.80కోట్లతో డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. తొలిదశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత టీసీఎ స్‌ను మరింత విస్తరిస్తారు. అప్పుడు 10వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. విశాఖలోని రుషికొండ ఐటీపార్కు హిల్-2పై నాన్ సెజ్ ఏరియాలో డల్లాస్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన భవనంలో లీజు ప్రాతిపదికన ఆఫీసు ఏర్పాటుకు టీసీఎస్ ముందుకు రాగా.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే డల్లాస్ భవనంలో 1400 మంది వరకు మాత్రమే పనిచేయడానికి స్థలం సరిపోతుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ప్రతిపాదనల మేరకు సీటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పక్కనే ఖాళీగా ఉన్న స్థలాన్ని అదనంగా కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో ఐటీ కేంద్రంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖలో యాంకర్ కంపెనీలు లేకపోవడం ఇంతవరకు పెద్ద లోటుగా ఉండేది. ఈ లోటును భర్తీ చేయడంపై ఐటీ మంత్రి లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖకు టాప్-10 కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిపి. వారిని విశాఖకు ఆహ్వానించారు. ఇన్ఫోసి్‌సకు పక్కనే టీసీఎస్ డెవల్‌పమెంట్ సెంటర్ ప్రారంభమైతే విశాఖ ఐటీ కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ భారీ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభిస్తే.. అనుబంధ పరిశ్రమలతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుంది. వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.