గోవాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో యువకుడు అనుమానాస్పదరీతిలో శవమై తేలాడు. రెండు రోజుల కిందట తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యువకుడు అక్కడ హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజాగా, ప్రకాశం జిల్లాకి చెందిన యువకుడు మృతిచెందిన ఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.... ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలం కొట్టాలపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి విజయకుమార్ కనిగిరిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు దినకర్ (34) బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
దినకర్ మూడు రోజుల కిందట పని నిమిత్తం గోవాకు వెళ్లాడు. అక్కడి ఏం జరిగిందో తెలియదుగానీ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడ్ని స్థానిక పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా వెలిగండ్ల ఎస్సై మధుసూదన్‌రావుకు గోవా పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం తండ్రి విజయ్ కుమార్, బంధువులకు ఆయన ద్వారా విషయం తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే గోవాకు బయలుదేరి వెళ్లారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై గోవా పోలీసులు అమానాస్పద మృతి కేసు నమోదుచేశారు.
కొత్త ఏడాది వేడుకలను జరుపుకోడానికి తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఎనిమిది మంది యువకులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు. కలంగుటే బీచ్‌లోని మెరీనాషాక్ దగ్గర డిసెంబరు 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో హోటల్ సిబ్బంది, యువకులు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో రవితేజ అనే వ్క్తి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కేసు నమోదుచేసి.. నిందితులను అరెస్ట్ చేసినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ వెల్లడించారు. హోటల్ యజమాని నేపాల్‌కు చెందిన అగ్నెల్ సిల్వేరా, అతని కుమారుడు షుబర్ట్ సిల్వేరియా, సిబ్బంది అనిల్ బిస్తా, సమల్ సునార్ల అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకు తరలించారు.
ఇటీవల గోవాలో స్వదేశీ పర్యటకుల పట్ల స్థానిక వ్యాపారులు, రెస్టారెంట్ యజమానులు దారుణంగా వ్యవహరిస్తున్నట్టు పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇక, వీరి వైఖరితోనే గోవాకు వెళ్లే స్వదేశీ టూరిస్ట్‌లు సంఖ్య పడిపోయింది. కొత్త ఏడాది సందర్భంగా గోవా వెలవెలబోయింది. దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. అలాగే, గోవా సీఎం సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa