సీఎం చంద్రబాబు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో ఉండగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయితో పాటు అధికార యంత్రాంగంతో చర్చించారు. ప్రమాదానికిగల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4.20గంటలకు స్విమ్స్‌కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. చికిత్స పొందుతున్నవారినీ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆస్పత్రి బయటకువచ్చి మీడియాతో మాట్లాడారు. టీటీడీ, పోలీస్ అధికారుల వైఫల్యాలపై మండిపడ్డారు. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ క్షమించమని వేడుకున్నారు.