కర్నూలు జిల్లాలో ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద సర్వే కార్యక్రమం ప్రారంభం కానుందని జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద రీసర్వే గురించి జిల్లాలోని ఆర్‌ఎస్‌డీటీలు, మండల సర్వేయర్లకు డిప్యూటీ తహసీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద జిల్లాలోని 25 మండలాల్లో 25 గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసుకుని సర్వేను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవోల ఆధ్వర్యంలో రీసర్వేపై ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులుతో కలిసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామ సరిహద్దులను గుర్తించి గ్రామంలోని అన్ని ప్రభుత్వ భూములను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 20వ తేదీ నుంచి నిర్వహించే రీసర్వేకు ముందుగా ప్రతి రైతుకు నోటీసు జారీ చేయాలన్నారు. గ్రామాన్ని 200 నుంచి 250 ఎకరాల బ్లాకులుగా విభజించాలన్నారు. ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి 3 నుంచి 4 బృందాలను కేటాయించాలని, ప్రతి బృందంలో ఇద్దరు విలేజ్ సర్వేయర్లు, ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఒక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉండాలని, పై బృందాలతో పాటు ఆ గ్రామంలో పని చేస్తున్న ఒక విలేజ్ సర్వేయర్ ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌తో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారి మునికన్నన్, ఆర్‌ఎస్‌డీటీ, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.