2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 497.96 కోట్లతో జిల్లా పరిషత్ అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. గురువారం విజయనగరం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జలాశయాల నిర్మాణానికి కృషి చేసిన మహనీయుల పేర్లు పెట్టి, భావితరాలకు వారి సేవలను గుర్తు చేయాలనుకోవడం గొప్ప విషయమన్నారు. ఆయా జలాశయాల వద్ద వారి విగ్రహాలను ఏర్పాటు చేసి పార్కులను నిర్మిస్తే వారికి సముచిత గుర్తింపు ఇచ్చినట్టవుతుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు గౌతు లచ్చన్న, జంఝావతికి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు, మడ్డువలసకు గొర్లె శ్రీరాములునాయుడు, తాటిపూడి జలశయానికి గొర్రెపాటి బుచ్చి అప్పారావు పేరును పెట్టడం సముచితమన్నారు.జిల్లాలో వికలాంగుల పింఛన్లను అనర్హుల పేరిట తొలగిస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతు న్నాయని జడ్పీ చైర్మన్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పందిస్తూ పింఛన్లు తొలగింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, వాటిపై అపోహలు వద్దన్నారు. ప్రస్తుతం రీ-వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోందన్నారు.