గ్రామాల్లో అనుమతులు లేకుండా అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని గరుగుబిల్లి మండల పంచాయతీ విస్తరణా ధికారి ఎల్.గోపాలరావు హెచ్చరించారు. తోటపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాన్ని ఆయన గురువారం పరిశీలించారు. దేవస్థానం పరిధిలో ఆక్రమణలపై ఇటీవల ఆలయ అభివృద్ధి సేవ ట్రస్టు ప్రతినిధులు డి.పారి నాయుడు, ఎం.పకీరునాయుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీపీవో ఆదేశాలతో ఆయన దేవస్థానం ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్టు గుర్తించి, పనులను నిలుపుదల చేశారు. ఈ పరిశీలనలో కార్యదర్శి ఎ.లలితకుమారి, వీఆర్వో టి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.