ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. మంత్రులు లోకేశ్, టీజీ భరత్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ప్రైవేట్ సెక్రటరీ కృష్ణ కపర్థి రావి, సీఎస్‌వో శ్రీనాథ్ బండారు, వైద్యాధికారి ఎండీ. అజారుద్దీన్‌తో కూడిన బృందం 19నే దావోస్‌కు బయల్దేరుతుంది. వీరి పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ అనే థీమ్‌తో నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. వారి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు దావోస్‌ను వేదికగా ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సహజ వనరులు, అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తారు. వివిధ చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక పాలసీలు, సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం మార్గదర్శకాల ప్రకారం దావోస్ సదస్సు వద్ద ఏపీ ప్రభుత్వం ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం రిజర్వ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.