తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. కలెక్టర్, ఎస్పీపై, అలాగే టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు. టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారు?.. ఆఫ్లైన్, ఆన్లైన్లో ఎన్ని టికెట్లు జారీ చేశారు... ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా సీఎం ప్రశ్నలు సంధించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు. బాధ్యత తీసుకున్నవారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు. భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.