సంకాంత్రి పండుగ వేళ ప్రైవేట్ బస్సుల యజమానులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనపు చార్జీలు వసూలు చేస్తూ వారి జేబులను గుల్లచేస్తున్నారు. ఏకంగా టిక్కెట్‌పై మూడు, నాలుగు రెట్లు వసూలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, చైన్నై వంటి నగరాలకు ట్రావెల్ బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి.సంక్రాంతి దృష్ట్యా రైల్వేశాఖ ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆర్టీసీ సైతం వేల సర్వీసులను నడుపుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అవి హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది సొంతూళ్లకు వచ్చేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళానికి రూ.1800 వరకూ టిక్కెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు రూ.4 వేలకు పలుకుతోంది. అలాగే, మచిలీపట్నం నుంచి శ్రీకాకుళానికి సాధారణ రోజుల్లో రూ.800 టిక్కెట్ ఉండగా.. ఇప్పుడు రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ట్రావెల్స్ యజమానులు సిండికేట్ అయినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.