ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కార్యక్రమం పేరును టీడీపీ కూటమి సర్కారు మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ జగనన్న కాలనీల పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలు పేరును ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా మార్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న కాలనీల పేర్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన - ఎన్టీఆర్ నగర్‌గా మార్చారు. ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను కేంద్రం అందించే నిధులతో పాటు రాష్ట్ర వాటాను కలిపి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల పేర్లను మార్చారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పలు పథకాల పేర్లలో మార్పులు చేశారు. స్వాతంత్రోద్యమ నాయకులు, సంఘ సంస్కర్తల పేర్లను పెట్టారు. ఈ క్రమంలోనే జగనన్న కాలనీల పేర్లను కూడా పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా ఏపీ ప్రభుత్వం మార్చింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు.జగనన్న గోరుముద్ద పేరిట అందించే మధ్యాహ్న భోజనం పథకాన్ని ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్చారు.
అలాగే వైసీపీ హయాంలో ప్రారంభించిన మన బడి - నాడు నేడు కార్యక్రమాన్ని ‘మన బడి - మన భవిష్యత్తు’ అని నామకరణం చేశారు, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా టీడీపీ కూటమి సర్కారు మార్చింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పులు చేశారు. ఇక తాజాగా జగనన్న కాలనీల పేరును పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.