వచ్చే 2 ఏళ్లలో దేశంలో మరో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే ఇప్పటికే అమృత్ భారత్ రైళ్లను గతేడాది ప్రారంభించగా.. వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమృత్ భారత్ 2.0 రైళ్లను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తయారు అవుతున్న అమృత్ భారత్ రైళ్లతోపాటు వందే భారత్ స్లీపర్ రైళ్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే అశ్వినీ వైష్ణవ్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. రాబోయే రెండేళ్లలో చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఇక గతేడాది జనవరిలో అమృత్ భారత్ వెర్షన్ 1.0ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు. వాటికి గతేడాది రైలు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్ భారత్ వెర్షన్ 2.0 లో కొత్తగా 12 రకాల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు.
అమృత్ భారత్ వెర్షన్ 2.0లో కొత్తగా 12 రకాల ఫీచర్లను అదనంగా తీసుకువచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫీచర్, మాడ్యులర్ టాయిలెట్స్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్‌లను జోడించారు. అంతేకాకుండా వందే భారత్ రైళ్లలో లాగే నిత్యం వెలిగే లైట్లు, ఛార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ కూడా మార్చినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్యాంట్రీ కారును సమూలంగా మార్చినట్లు పేర్కొన్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల లక్ష్యంగా ఈ అమృత్ భారత్ 2.0 రైళ్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అమృత్ భారత్ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు.