ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ఓ గర్భవతి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. 2019లో మలేషియాలో జరిగిన ఈ ఘటనపై క్లాంగ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. బాధ్యులైన ఇద్దరు వైద్యులకు 6 మిలియన్ల రింగ్గిట్ (రూ.11.42 కోట్లు) జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఆమె ఇద్దరు పిల్లలకు చెరో రూ.1.9 కోట్లు, మృతురాలి తల్లిదండ్రులకు రూ.57 లక్షలు చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది.ఇద్దరు వైద్యుల్లో ఒకరు డ్రింక్ కోసం హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయారని, విధుల్లో ఉన్న మరో ముగ్గురు నర్సులు కూడా మహిళ మృతికి కారణమని న్యాయస్థానం తేల్చింది. క్లాంగ్‌లోని ‘షాన్ క్లినిక్ అండ్ బర్త్ సెంటర్’లో 2019లో ఈ ఘటన జరిగింది. పునీత మోహన్ అనే మహిళ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే చనిపోయింది. ఇందుకు కారణమైన వైద్యులు మునియాండి షణ్ముగం, అకాంబరం రవి, విధుల్లో ఉన్న ముగ్గురు నర్సులు ఇందుకు బాధ్యులని న్యాయస్థానం పేర్కొంది.రక్తస్రావమవుతున్న పేషెంట్‌ను ప్రమాదం నుంచి బయటపడేయడంలో స్పెషలిస్ట్ వైద్యులు ఇద్దరూ విఫలమయ్యారని జస్టిస్ నార్లిజా ఒత్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత సాధించని నర్సులను రోగి పర్యవేక్షణలో ఉంచారని జడ్జి మండిపడ్డారు. రక్తస్రావం అవుతున్నట్టుగా మృతురాలి తల్లి గుర్తించి నర్సులను అప్రమత్తం చేశారని, నర్సులు వచ్చి దూదిని ఉపయోగించి రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించారని న్యాయమూర్తి వెల్లడించారు. రోగి పరిస్థితి విషమంగా మారిన తర్వాత వేరే హాస్పిటల్‌కు షిప్ట్ చేశారని, వైద్యులు ముందుగానే పర్యవేక్షించి ఉంటే విషాదాన్ని నివారించి ఉండేవారని జస్టిస్ ఒత్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.