స్మార్ట్ ఫోన్... ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడగా, కొడుకు లేని జీవితం తనకెందుకు ఆ తండ్రి కూడా బలవన్మరణం చెందిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాందేడ్ ప్రాంతానికి చెందిన ఓంకార్ 10వ తరగతి చదువుతున్నాడు. 16 ఏళ్ల ఓంకార్ ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు. అన్నదమ్ములు ముగ్గురు ఉద్గిర్ లోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. మకర్ సంక్రాంతి సెలవుల కోసం ఓంకార్ స్వగ్రామానికి వచ్చాడు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరాడు. ఆన్ లైన్ క్లాసులు, ఇతర విద్యా ప్రయోజనాల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమని తండ్రికి చెప్పాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి అతడి కోసం వెదికాడు. తమ పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఓంకార్ విగతజీవుడిలా కనిపించాడు. ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందిన తండ్రి... ఓంకార్ మృతదేహాన్ని కిందికి దింపి, అదే తాడుతో అదే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.